Saturday, November 17, 2012

ఓ రైతు గోస (మట్టి మనిషిని )


ఓ రైతు గోస


"సబ్సిడీలో ఇచ్చిన తాలుగింజల్ని సగం నేలతల్లి మింగేసి
నెలతక్కువ బిడ్డల్ని ప్రసవించింది.

ఎదిగీ ఎదగని చిరుమొలకలు పాలిపోయిన పసిమోఖాలతో,
పవనుని పాటకు తలలూపుతున్నాయి.

నా చెమట వాసననూ ,చిరిగినా బట్టలనూ చూసిన
మేఘమాలికలు పక్కున నవ్వి పరుగులెడుతున్నాయి.

అన్యం పుణ్యం ఎరుగని రైతునూ..
చదువూ సంద్యా లేని పల్లెటూరి బైతునూ.
మాయా మర్మాలు నాకేమి తెలుసూ..

బావినుండి తోడిన నీటితో తానమాడుతున్న
నా మొలకల కూతుళ్ళను తొంగి చూసేది సూరీడనీ

నారుమడులన్నీ పసల పోరగాడి తోర్రిపళ్ళలా
నంగి నవ్వులు నవ్వుతూ నన్నెక్కిరిస్తున్నాయనీ

నా అంతరాంతరాలలో అప్పుల భయాన్ని పారదోలే
ఆశల కంకులు కీటకాల పాలవుతాయననీ

నా నెత్తిమీద ఎండా నిప్పులు చెరుగుతుంటే,
ఎండిన పెదాలు ఎండమావుల్ని వెతుకుతాయనీ..

చద్దన్నంలో నేను ఉల్లిపాయ కొరుకుతుంటే
వెంట ఉన్న నీ కళ్ళు మంటలెత్తుతాయనీ..

కాలువ గట్టున కూర్చ్చున్న నా కళ్ళలో
నువ్వు వెళ్ళే కారు దుమ్ము కొడుతుందనీ..

నేలతల్లిని అమ్ముకొనీ , కన్నతల్లిని వదుల్చుకొనీ
పట్నమెల్లి బతకనేర్చిన సదూకొన్నోడివనీ..

అన్నదాత అంటే అప్పుల దుప్పటి కప్పుకున్నోడనీ
రాయితీ అంటే రాత తెలిసిన వాడాడే నాటకమనీ..

పల్లె నిండా బతికున్న శవాలే తిరుగుతున్నాయనీ
నా ఇంట కూడా చావు మేళం మోగుతుందనీ..

మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో పాకి, మట్టిలో ఆడి , మట్టిని నమ్ముకొని, మట్టిని హత్తుకొని,మట్టిని కప్పుకొని, మట్టిలో కలిసిపోయే పేద రైతుని..నీ ఆకలి తీర్చటం తప్ప అన్యం పుణ్యం ఎరుగని అమాయకపు అన్నదాతని".....
ఫాతిమా





No comments: