Tuesday, July 20, 2010

నిశబ్దం!!!

మాతృమూర్తి ...!


సంతోషం వేసినా.. దుఃఖం కలిగినా.. దెబ్బ తగిలినా ..అప్రయత్నంగా మన పెదాలు పలికే తొలి పదం అమ్మ. దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటరు. తల్లి లేకుంటే తనువే లేదంటారు. అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు. అమ్మ పేగు పంచుకునే అంతటివాడు అవుతాడు. అవును.. అమ్మంటే ఓ అద్భుతం. అమ్మంటే ఓ అపురూపం. అమ్మంటే మురిపాలు.. జ్ఞాపకాలు.. లాలిపాటలు.. గోరుముద్దలు..గోరింటాకులు.. అక్షరాలు.. ఆలింగనాలు.. నడక.. నడత.. అనురాగాలు.. ఆత్మీయతలు. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ మదర్స్‌ డే సందర్భంగా మాతృమూర్తి గురించి కొన్ని మాటలు.
ప్రపంచంలో అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. ఓపికకు మారు పేరు అమ్మ. దెబ్బ తగిలితే ఓదార్పవుతుంది. కష్టమొస్తే కన్నీటి పర్యంతమవుతుంది. దారి తప్పితే అదిలిస్తుంది. గొప్పవాడైతే ఉప్పొంగిపోతుంది. చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తుంది. పెద్దయ్యాక తప్పుటడగులు వేయకుండా చూస్తుంది. చిన్న చిన్న సంతోషాలకే తల్లి గుండె సముద్రమంత ఉప్పొంగుతుంది.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే. ఈ ధరిత్రిలో అమ్మను మించిన దైవం లేదు. మాతృమూర్తి గురించి ఎన్ని కావ్యాలు రాసినా.. ఎన్ని గేయాలు పాడినా తక్కువే. అమ్మ అన్న మాటలో ఉన్న కమ్మదనం.. మరే పదంలో లేదు. త్యాగాలకు ప్రతిరూపం అమ్మ. సృష్టికి మూలం అమ్మ. దేవుడు మలచిన దైవం అమ్మ. అమ్మ ప్రేమ కమ్మనిది. అమ్మతనంలో నిజాయితీది స్వార్థం లేనిది. అమ్మ ప్రేమలోనే బిడ్డ ఎదుగుదల ఉంటుంది. ఆ ప్రేమే సమాజాన్ని ప్రేమించే మంచి మనిషిగా తయారు చేస్తుంది. బిడ్డల గురించి ఒక తల్లిపడే తపన, ఆవేదన మాటల్లో చెప్పలేనిది. ఇంకెవరు ఎవరి మన్ననల కోసమో.. బిరుదుల కోసమో.. మెప్పుల కోసమో.. తల్లి తన పిల్లలను లాలించదు. బిడ్డ అవిటిదైనా.. అందహీనంగా ఉన్నా తల్లికి ముద్దే. ఆకలి వేళ అమ్మ అక్షయపాత్ర. ఆపదవేళ ధైర్యాన్నిచ్చే మాత్ర. సృష్టిలో అమ్మ ప్రేమ అజరామం. సూర్యాచంద్రులు ఉన్నంత వరకు మాతృమూర్తి సేవ మరవలేనిది. శ్రీరామరక్ష అంటూ నీళ్ళు పోసి ధీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవిస్తుంది. నూరేళ్ళు ఎదిగే బతుకు అమ్మ చేతి నీళ్ళతోనే నడక నేర్చుకుటుంది. అమ్మ చేతి వేళ్ళతో చనుబాలు తాగితేనే బతుకు తీపేంటో అర్ధమవుతుంది.
అమ్మ అన్న మాట కంటే కమ్మని కావ్యం ఎవరూ రాయలేరు. అమ్మ అన్న రాగం కంటే గొప్ప గేయం ఎవరూ పాడలేరు. ఆలైనా.. బిడ్డయినా ..ఒకరు పోతే ఇంకొకరు. కానీ అమ్మ పదవి ఖాళీ అయితే.. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అమ్మంటే ప్రతిఫలం ఆశించని చాకిరీ. అమ్మంటే రాజీనామా తెలియని నౌకరి.
నవమాసాలు మోసి.. పేగుపంచి.. ప్రాణం పోసి.. ఒక బిడ్డకు జన్మనివ్వడమంటే అంత ఆషామాషీ కాదు. అదొక పునర్జన్మ. బిడ్డ ప్రాణాలకు తన ప్రాణం అడ్డేసి.. ఈ ప్రపంచానికి పరిచయం చేసి.. ఆలనా పాలనా చూసి.. పెంచి పెద్ద చేసి.. ఒక ప్రయోజకుడు అయ్యే వరకు తిండీ తిప్పలు మానేసి.. కష్టమైనా నష్టమైనా బిడ్డ కోసం భరించి.. అన్ని సుఖాలను త్యజించేది అమ్మ. ప్రపంచం చుట్టి రమ్మంటే...తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన వినాయకుడికి తెలుసు అమ్మానాన్నల విలువేంటో. భుజాన కావడి వేసుకుని అమ్మానాన్నలకు మోసిన శ్రవణుడికి తెలుసు కన్న తల్లిదండ్రుల గొప్పతనమేంటో. అమ్మను తలుచుకోవడానికి ఒక రోజేంటి ఒక గంటేంటి...అసలు సమయమెందుకు. ఆమె ఒక నిరంతర ఆరాధ్యనీయురాలు. ప్రతి శిశువు అమ్మ ఒడిలోనే ప్రపంచాన్ని చూసేది. తినడానికి నాలుగే రొట్టెలుండి.. తినే వాళ్ళు ఐదుగురుంటే నాకొద్దు అనేది ఖచ్చితంగా అమ్మే. ఈ ప్రపంచం ఇంత నిర్విఘ్నంగా నడుస్తుందంటే దానికి కారణం ఏ స్వార్ధం లేని అమ్మలే!
మరి ఇంత గొప్ప మాతృమూర్తికి మనం ఏపాటి గౌరవం ఇస్తున్నం. మన బాగోగుల కోసం నిత్యం తపించిన ఆ తల్లిని మనం ఎన్నిసార్లు తలుచుకుంటున్నం. నిజం చెప్పాల్నంటే మనం అమ్మను మరిచిపోతున్నం. ఆమ్మ చేతివంటకు దూరమవుతున్నం. అమ్మ ప్రేమకు దూరమవుతున్నం.
అమ్మ రుణం తీర్చుకోలేనిది. ఈ సృష్టిలో అమ్మ కన్నా గొప్పది ఇంకేమి లేదు. నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి కని, మనల్ని కంటికి రెప్పలాగ కాపాడి, ఆలనా పాలనా చూసి పెంచి పెద్ద చేస్తుంది. మరి అలాంటి అమ్మకు మనం ఏమి ఇచ్చినా తక్కువే. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనం అమ్మను మరిచి పోతున్నం. అమ్మను పట్టించుకోవడం లేదు. మనకోసం తన జీవితాన్ని ధారపోసి పెంచి పెద్దచేస్తే.. ఆమెకు మనం ఇచ్చే విలువ ఎంత? ఎవరైనా చెప్పగలరా? మదర్స్ డే అని ఇవ్వాళ ప్రచార సాధనాలు ఊదరగొట్టేస్తున్నయి. ఈ రోజు తప్పితే అమ్మ విలువ ఇంకెప్పుడు గుర్తుకు రాదు. అమ్మను ఈ ఒక్క రోజే గుర్తు చేసుకోవడం కంటే ఆత్మవంచన ఇంకోటి ఉండదేమో. అమ్మను ఏ అనాధ ఆశ్రమంలోనో, పల్లెటూళ్ళూనో పడేసి పట్టించుకోకుండా ఏడాదికి ఒకసారి గ్రీటింగ్, ఒక కేకు పడేసి సరిపోతుందిలే అనుకునే వాళ్ళే ఎక్కువయ్యారు. ఇదా మన సంస్కారం. ఇదా మన సంపదలు తెచ్చిన వైభోగం. అమ్మ కోరేది ఈ ఒక్కరోజు ఆర్భాటాల్నీ.. వేడుకల్నీ.. బహుమతుల్నీ.. ప్రశంసల్నీ కాదు. అమ్మ అన్న ఒక కమ్మని పిలుపును మాత్రమే ఆమె ఆశిస్తుంది. మణిమాణిక్యాలను కాదు.. ముదిమి మీద పడితే నేనున్నానే ఒక్క భరోసాను కోరుకుంటుంది. ఎన్ని కోట్లు సంపాదించినా.. ఎన్ని కీర్తి ప్రతిష్టలు మూటగట్టుకున్నా.. ఢిల్లీకి రాజైనా.. అమ్మకు కొడుకే. అమ్మను నిర్లక్ష్యం చేయవద్దు. అమ్మను సంతోషపెట్టాలి. ఉద్యోగం ముసుగులో వృద్ధాశ్రమాలకు తరలిస్తూ దిక్కులేని వారిని చేస్తున్నారు. ఏదో ఒకరోజు వచ్చి పలకరించి వెళుతున్నారు. ఇది కాదు మనం అమ్మకు ఇచ్చే గౌరవం.
పెళ్లిళ్లకూ.. శుభ కార్యాలకూ కాదు. సిజేరియన్లకు కూడా వీడియో తీయాలి. అప్పుడైనా తెలుస్తుంది.. కన్నతల్లి కడుపుకోతేంటో! తల్లిపడే బాధ ప్రత్యక్షంగా తెలియడానికే కొన్ని దేశాల్లో బిడ్డ పేగును తండ్రితో కత్తిరింపచేస్తరు. ఇవాళ అమ్మలందరూ వృద్ధాశ్రమాల ముందు క్యూ కడుతున్నరంటే.. కొడుకులూ కోడళ్లూ తల్లుల్ని ఎలా చూసుకుంటున్నరో అర్ధం చేసుకోవచ్చు. డాలర్‌ నోట్లను ఊహించుకుంటూ విమానమెక్కి ఖండాంతరాలు ఎగిరిపోతుంటే.. ఆ ముసలి ప్రాణం ఎక్కడుండాలో తెలీక.. దిక్కూమొక్కూ లేని దానిలా ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నది.
జెనరేషన్‌ మారిపోయింది. లవ్‌ మ్యారేజ్‌ చేసుకోవడం.. విదేశాలకు వెళ్లి సెటిల్‌ అవడం. ఈ కాన్సెప్ట్‌ లో ముసలి తల్లి బలైపోతున్నది. ఒక్కోసారి అత్తా కోడలికి పడదు. కోడలు మంచిదైతే కొడుకు మంచోడు కాదు. కొడుకు మంచోడైతే కోడలు మంచిది కాదు. పెద్దావిడ.. ఏదో ఛాదస్తం అని కోడలుపిల్ల ఊరుకోదు. గొడవ ముదురుతుంది. కొడుకు కూడా భార్య మాటే వింటడు. చెప్పినట్టు పడుండమని అమ్మకు సర్దిచెప్పబోతడు. తల్లికి పెద్దరికం అడ్డొస్తుంది. కడుపున పుట్టిన వాడే మాట వినట్లేదని కోపం వస్తుంది. మాటా మాటా పెరుగుతుంది. వదిలించుకోవాలని చూస్తరు. ఇక కొన్ని కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటరు. ఇంట్లో ముసలమ్మ ఒక్కతే ఉంటుంది. బీపీతోనో షుగర్‌తోనే బాధ పడుతుంటుంది. టైమ్‌కు మెడిసిన్‌ ఇవ్వాలి. దగ్గరుండి తిండి పెట్టాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఉద్యోగాలు. చూసుకునేందుకు వీల్లేదు. ఇలాంటి సందర్భాల్లో అమ్మకు మెల్లిగా సర్దిచెప్పి ఆశ్రమాల్లో వదిలేస్తున్నరు. చాలా ప్లాన్డ్‌ గా వదిలించుకుంటున్నరు. మళ్లీ ఫోన్‌ కూడా చేయరు. టైమ్‌కు మనియార్డర్‌ మాత్రం పంపిస్తారు. మళ్లీ మొహం కూడా చూపించరు.
మనుషులు పడక.. మాటలు కుదరక.. మనసులు టాలీ అవక.. అడ్జస్ట్‌ కాలేక.. ఇక్కడికైతే వస్తారుగానీ.. మనసంతా కన్నకొడుకు మీదే ఉంటుంది. వాడు టైమ్‌కు తింటున్నాడో లేదో అని తల్లి గుండె ఆరాటపడుతునే వుంటుంది. ఏ క్షణాన కొడుకూ కోడలు వచ్చి.. తీసుకుపోతరో అని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తుంటరు. చూడ్డానికి వచ్చినప్పుడు తీసుకపో బిడ్డా అని నోరారా అడుగుతరు. అయినా కొడుకు నోటినుంచి సమాధానం ఉండదు. అప్పుడా తల్లి గుండె క్రషర్‌లో పడుతుంది. కన్నీళ్లు కనపడనీయకుండా.. పైకి సంతోషంగానే ఉన్నాం అంటరు. కానీ లోపల తుఫాను బీభత్సం. ఒకరకమైన మెంటల్‌ టార్చర్‌. ఆశ్రమం వాళ్లు ఎంత బాగా చూసుకున్నా.. సొంతవాళ్ల దగ్గర దొరికినంత ఆప్యాయత.. అనురాగం ఇక్కడ లభించదు. కన్నవాళ్లు గ్లాస్‌ మంచినీళ్లిచ్చినా అదో సంతృప్తి. కొందరు బయటకి చెప్పుకుంటరు. కొందరు చెప్పుకోరు. అయినా కన్నపేగు మీద కించిత్‌ కోపం కూడా రాదు. కొడుకు మారుతాడని కొండంత ఆశతో ఉంటారు.
ఏ తల్లయినా బిడ్డ ప్రేమనూ.. అనుబంధాన్నీ కోరుకుంటుంది. అంతే తప్ప డబ్బు మూటల్ని కాదు.. బంగారు ఆభరణాల్ని కాదు. ప్రతీదీ డబ్బుతో కొలిచే నేటి తరానికి.. ఆ పచ్చ నోట్లతో వెల కట్టలేని కన్నపేగు అనే బంధం ఒకటుందని తట్టదు. అసలు కాసేపు తల్లిదండ్రులతో గడుపుదామనే ఆలోచనే రాదు. చిన్నప్పుడు కొంగుతో కన్నీళ్ళను అద్ది.. కొండంత ఓదార్పు అయ్యే అమ్మను పెద్దయిన తరువాత మనం కన్నీళ్ళపాలు చేయడం ఎంత వరకు సబబు?
ఉద్యోగం.. కెరియర్‌. ఇవన్నీ నిజమే. కానీ బొత్తిగా పది నిముషాలు కూడా దొరకనంత బిజీగా ఉన్నారా. ఇలా హెక్టిక్‌ అంటూ తప్పించుకునేవారు తమ సరదాలు, షికార్లు, సినిమాలు ఏవీ మానుకోరు. స్నేహితులు, భార్యాబిడ్డలతో గడపడమూ వదులుకోరు. కానీ అమ్మానాన్నలకు కాస్తంత సమయం కేటాయించాలంటే చాలు.. పని ఒత్తిడి, బిజీ షెడ్యూల్‌, సెలవు దొరకదు... ఇలాంటి సవాలక్ష వంకలన్నీ వచ్చి పడిపోతయి. రా రమ్మని కోరే తల్లిదండ్రులకు చెప్పే ముచ్చటైన కారణాలు ఇవేగా?! కానీ అక్కడికి వెళ్తే వారి మనసులెంత తృప్తి చెందుతాయో ఆలోచించరు. కీళ్లనొప్పులైనా, శరీరం సహకరించకున్నా ఓపిక చేసుకుని వండి వడ్డించిన వంటల్లో మాధుర్యం మరెక్కడా రాదు. ఆ రుచి వెనుక అమ్మ ప్రేమ తప్ప అదనంగా వేసిన దినుసులంటూ ఏమీ వుండవు. ఇవన్నీ తండ్రి పైకి చూపలేకపోవచ్చు. కానీ ప్రయోజకులైన బిడ్డల్ని చూసుకుని గుంభనంగా గర్వపడేది ఆయనే. ఆ ఆనందాన్ని మీసాలమాటున దాచుకుని.. హుందాగా తలపంకించేది తండ్రే. ఇదంతా మన వొంటికి నులివెచ్చగా తాకుతుంది. తండ్రి వెచ్చని స్పర్శలో.. తల్లి చల్లని చూపులో పారవశ్యం చెందితే చాలు.. ఉన్న సమస్యలన్నీ దూదిపింజల్లా తేలిపోతయి. రెట్టించిన ఉత్సాహం సొంతమవుతుంది. తనువంతా నూతనోత్తేజంతో నిండిపోతుంది. అందుకే రెండు రోజులు తీరిక చేసుకోవాలి. వెళ్లి అమ్మ సందిట నిలవాలి. ఆ మమకారపు జల్లుల్లో ఆసాంతం తడవాలి. పనులన్నీ పక్కనపెట్టి కొంచెం సమయం అమ్మానాన్నలకోసం అంకితం చేయాలి. వాళ్లు ప్రతిఫలాపేక్ష చూసుకోకుండా జన్మంతా మనకోసం అంకితం చేసినవారు. మన రాక వారి కళ్లలో కాంతి నింపుతుంది. ఆ కాంతి తిరిగి వెన్నెలలాగా చల్లగా మనపైనే కురుస్తుంది. అది మన జీవితాల్లో వెలుగు నింపుతుంది.
మనం ఏ కష్టమొచ్చినా అమ్మ ఒడిలోనే స్వాంతన పొందేది. మన వెనుకున్న ధైర్యం అమ్మ. మనలని ముందుకు నడిపించే సైనిక అమ్మ. ఎంత ఎదిగినా అమ్మ ముందు మనం చిన్నపిల్లలమే. అమ్మ సమస్త జీవరాశికి అద్భుతమైన వరం! యుగాలు మారినా.. తరాలు తరలినా.. మాతృమూర్తి ప్రేమ అజరామరం.

Tuesday, July 13, 2010

జై తెలంగాణా....

తెలంగాణా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల జన్మ హక్కు
మా కృష్ణ గోదావరి నీళ్ళు మాకు కావాలె
మా భూములు మాకు కావాలె
మా బొగ్గు తోని తాయారు అయిన విద్యుత్తు మాకు కావలె
మా కొలువులు మాకు కావలె
మా తాతల చెమట నెత్తురు తోని కట్టిన హైదరాబాద్ మాకు కావాలె
పొట్ట చేత పట్టుకొని వొచ్చినోని తోని మాకు బాధ లేదు, దోచుకొను వచ్చినోన్ని తెలంగాణా పొలిమేరలకు తరిమి కొడుతం

సిపాయి తిరుగుబాటు విఫలమయ్యింది అని ఆగిందా భారత స్వతంత్ర సంగ్రామం
ఒక తరం వోరిగిపోతే ఇంకొక తరం అందుకోలేద పోరాట పందాను
నిజాం దోపిడి రజాకార్ ల దౌర్జన్యం పోయింది అని ఆగిందా తెలంగాణా కోరిక
ఆంధ్ర దొరల దోపిడీకి తుపాకి దెబ్బలకు వోరగాలేద తెలంగాణా అమరవీరులు
తెలంగాణా స్వయం పాలన కోరిక తరం తరం నిరంతరం ఎగసిపడే ఉప్పెన
జై తెలంగాణా....

Real india is in villages

ఉత్తమం వ్యవసాయం
మధ్యమం వ్యాపారం
అధమం ఉద్యోగం
అధమాను అధమం యాచకం
నా జీవితాశయం వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించటం,గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపించటం.
real india is in villages
దేశానికి రైతే వెన్నుముక అని చాటిచేప్పటం ఒక సైనికుడు కాలి కడుపు తోని యుద్దానికి ఎలా పోలేడో
ఆహార బద్రత[food security] లేకుంట దేశం ముందుకు పోలేదు అని ప్రజలు, ప్రభుత్వాలు గ్రహించాలి.
అందరు గ్రామాలను వదిలి పట్టణాలకు పొయ్యి ఇంజనీర్లు డాక్టర్లు అయ్యి ఉ.కే. యు.ఎస్ పోవాలి అంటే కష్టం, అందరికి వుద్యోగాలు దొరుకవు, దొరికినా జీవితాంతం వుండవు.కంప్యూటర్లు అందరికి తిండి పెట్టవు.
మన గొర్రెలకు ఈ విషయం ఇంకా బుర్రకు ఎక్కుతలేదు.ఇంకా కంప్యూటర్లు సాఫ్టువేరు తిండి పెడుతది,భారత దేశం వెలిగిపోతుంది అనుకుంటున్నారు.