Saturday, April 14, 2012

"చేగువేరా"

వైద్యవృత్తి సేవానురక్తి కలిగి భాగ్యవంతుడైనా అభాగ్యుల బాగోగులకై పోరాడాలనే తపనతో, మార్క్స్ ఎంగెల్స్ లను, అవగాహనతో ఆలింగనం చేసుకొని,అర్జెంటీనాలో పుట్టినా, క్యూబా విప్లవంలో వికసించి పరిమళించినా ప్రపంచమంతా విప్లవం ప్రజ్వలింప చేయాలని దేశాలు తిరిగి చివరకు బొలీవియాలో పోరాటంలోనే అమరుడై ....స్పృహవున్న చైతన్యకారులంతా జోహారులర్పించిన మేరునగధీరుడు "చేగువేరా" . గడుసైన చదువరి, గడుగ్గాయి విప్లవకారుడు.

25 సం.వయసులో క్యూబా విప్లవంలో,సాయుధ పోరాటంలో, ప్రముఖుడై విప్లవ ప్రభుత్వంలో భాగస్వామిగా వుండి కూడా త్రుప్తి చెందక విశ్వవ్యాప్తంగా విస్తృతంగా ఈ పోరాటాలు జరగటం తప్ప వేరే శరణ్యం లేదని కసిని రగిల్చి పోయిన వ్యక్తే ఈ " చేగువేరా ".పీడిత జనాలు చారిత్రక విజ్ఞానాన్ని సముపార్జించుకొని, ద్రుడపోరాటాల ద్వారా విప్లవాలను సాధించుకోగాలరని నమ్మి గోదాలోకి దిగిన వ్యక్తి "చేగువేరా ".

మానవచరిత్ర పరిణామంలో,రాజకీయాలు,శాస్త్రాలూ, కళలూ తర్వాత వచ్చిన రాజ్యాంగ యంత్రమూ, నైతికసూత్రాలూ, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకపోవడం అంతేగాక పేదప్రజలకు వ్యతిరేకంగా తయారవడం, చే గువేరాను మరింతగా వేధించింది.

వసుదా పదునైన మేధ, చురుకైన యోధ అయినవాడు, చతికిలపడి కూర్చోవద్దని, విప్లవానికి నిద్రలేదని, సాయుధపోరాటం తప్పదనీ, విస్తృతంగా జనావళికి ఎలుగెత్తి చాటిన వాడు "చేగువేరా".ఇప్పుడు హిప్పీల్లాంటి నవయువకులు చే ఫోటోలు ముద్రించిన టీ షర్ట్ లతో,జీన్స్ ఫాంట్ లతో విరివిగాకనపడుతున్నారు. వీరిలో ఎవరికి చేగువేరా చరిత్రే తెలియదు.

మరణం తర్వాత డమురుకం మ్రోగించిన వాడే "చే గువేరా ".లాటిన్ అమెరికా, ఆరబ్, ఆసియా, ఆఫ్రికా దేశాల వారికి ఆరని విప్లవ జ్యోతి, విశ్రమించని, నిష్క్రమించని వీరుడు చే గువేరా! బుద్ధిగల చేపలకు సొగసైన విప్లవ వలను విసిరే జాలరి "చే గువేరా ". విశ్వ విఫణిలో శ్రామిక ,కర్షక, బడుగు జీవుల కళల బేహారి. అసలు సిసలు గెలుపు జూదరి "చే గువేరా".

No comments: